ముళ్ళపూడి వారి బుడుగు ఇప్పుడు ఎలాగా ఉన్నాడు?

ముళ్ళపూడి వారి బుడుగు ఇప్పుడు ఎలాగా ఉన్నాడు?

రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు 

జయంతి ప్రకాశ శర్మ గారి బుడుగు మీద కథనం తరువాత నాకు ఇప్పుడు బుడుగు మనమధ్య వుంటే ఎలా ఉండేవాడా అనిపించి రాస్తున్నాను.

బుడుగు బుడుగు అని మనమందరం పిలిచే వ్యక్తి పేరు శంకర శాస్త్రి . చిన్నప్పుడు నుంచి రైల్ ఇంజన్ డ్రైవర్ ని చూసి తానూ కూడా రైల్ ఇంజిన్ డ్రైవింగ్ చేయాలనుకునేవాడు. నీకో ఫది బీడీలు ఇస్తాను ఇంజిన్ తోలనిస్తావా అని కూడా అడిగాడు కదా ఆ ఇష్టం పెద్దయ్యాకా కూడా ఉండేది. ఫలితంగా ఆంధ్రా యూనివర్సిటీ లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి రైల్వే లో మెకానిక ఇంజినీర్ అయ్యాడు. అంచలంచలు గా ఎదిగి డివిజనల్ మానేజర్ గా రిటైర్ అయ్యాడు.


చిన్నప్పటినుంచి బావా బావా అని పిలిచే జ్ఞాన ప్రసూనాంబ ని పెళ్లి చేసుకున్నాదు. జ్ఞాన ప్రసూనాంబ ఎం ఏ ఇంగ్లీషు చేసి కాలేజీ లో లెక్చరర్ గా చేరి ఈమధ్యనే రిటైర్ అయింది . వయసు పెరిగినా చిన్నప్పటిలాగా బుడుగూ అని పిలుస్తుంది . మన శంకర శాస్త్రి అదే మన బుడుగుని ఆట పట్టిస్తుంది. బయటకు మాత్రమే ఆయన రైల్వే లో డివిజనల్ మానేజరు కాని ఇంట్లోమాత్రం బుడుగే ( జ్ఞాన ప్రసూనాంబ కి). బుడుగు పిల్లలు ఇద్దరూ పెద్దవాళ్ళయ్యారు. ఇద్దరూ ఇంజినీరింగ్ చదివి అమెరికా వెళ్ళారు. వాళ్ళకీ పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళ పిల్లలు బుడుగు ప్రసూనాంబ లాగా ఆడుకుంటున్నారు. వాళ్ళు అమెరికా లో ఉండడం వల్ల వాళ్ళను కాపాడ డానికి బామ్మ లేదు. ఇండియా వచ్చినప్పుడు అల్లరి తో ఇల్లు పీకి పందిరేస్తారు. వాళ్ళను చూసి శంకర శాస్త్రి కి ప్రసూనాంబ కి తమ బాల్యం గుర్తుకొస్తుంది.

బుడుగు తండ్రి గోపాలం తాసీల్దారు గా రిటైర్ అయ్యారు. ఆయనకు వయసు ఎనభై ఐదు దాటింది. బుడుగు తల్లి రాధ కి ఇంచుమించి అదే వయసు . అంత వయసు లోను ఇద్దరూ ఇంటి పని తోట పని చేసుకుంటారు. చెప్పుకోదగ్గ వైద్య సమస్యలేమీ లేవు. చిలకా గోరింకల్లాగా తిరుగుతున్నారు. బాపు గారి సృష్టి కదా ఇద్దరూ బరువెక్క కుండా నాజూగ్గా ఉన్నారు. పెన్షన్ వస్తోంది. స్వంత ఇంట్లో వున్నారు. ప్రశాంతం గా ఉన్నారు. మునిమనవడు మనవరాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తో బాగా ఆడుకున్నారు. వాళ్లకి వాళ్ళ బుడుగు జ్ఞానప్రసూనాంబా గుర్తుకొచ్చారు.


ఇంకా బుడుగు బాబాయ్ , పక్కింటి రెండు జెడల సీత పెళ్ళి చేసుకున్నారు. వాళ్ళూ రిటైర్ అయ్యారు. వాళ్ళ పిల్లలూ అమెరికా చేరారు. బుడుగు బాబాయి వయసు ఇప్పుడు ఎనభై.


బుడుగు ని హారి పిడుగా అన్న బామ్మ కాలంచేసి చాలా ఏళ్ళయింది. మునిమనమలు ఇంటర్ పాస్ అయ్యే దాకా ఉంది. ఇప్పుడు ఆమె బుడుగు తాత గారి ప్రక్కన ఫోటో లో వాళ్ళ ఇంటి హాల్ లో ఉంది వీళ్ల పనులన్నీ గమనిస్తూ ఆశీర్వదిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *