ఈ గట్టు మీద ఏ చెట్టు అయినా మందుకు పనికోస్తూందోయ్

Author: Shri JP Sarma, Special Senior Assistant, SBI

రత్నాలమ్మగారి కోపం ఆ రోజు తారస్ధాయినందుకుంది. దెబ్బలాటలు. అరుపులు, కెకల్లు అయ్యకోనేరుగట్టు మీద వినబడిన సందర్భాలు చాల తక్కువనే చెప్పాలి. చిన్నచితక ఏవున్న వేంటనే సర్దుమనిగిపోయెవి. అలాంటిది రత్నలమ్మగారి గొంతుక ఒకటి రెండిళ్ళు అటూఇటూ కూడా వినబడినస్ధాయిలో ఉందంటే పరిస్ధతి కొంచెం చెయ్యి జారిందనే చెప్పాలి.

‘అఁ ప్రతీరోజూ ఉన్నదేకదా’ అని ఊరుకోబోయారు భర్త ముకుందరావు.

“ఊహుఁ వీల్లేదంటే వీల్లేదు. ఈ దిక్కుమాలిన కొంపలో ఒక్కరోజుకాదుకదా.. ఒక్క క్షణంకూడా ఉండలేను. అసలా పార్వతమ్మ. మొహం చూడ్డమే అసహ్యంగా ఉంది. ఆవిడగారి సొంతకొంపలా రోజూ సాదింపులు.. ఇదీనూ. ” అక్కడతో అయిపోతుందనుకున్నారు ముకుందరావు. కాస్సేపు అయితే అదే చల్లారుతుందిలే అని సరిపెట్టుకున్నారు.

” చీ..చీ..మీరూకూడా అంతే. ఇంటి విషయం ఒక్కటికూడా పట్టించుకోరుకదా. రేపిపాటికి కొంప మార్చకపోతే నేనే ఏ నుయ్యో, గొయ్యో చూసుకుంటా.” రత్నాలమ్మ గొంతుకస్ధాయి పెంచి భర్తకి అల్టిమేటం ఇచ్చిసింది.

ఇలాంటి అల్టిమేటాలు కూడా ముకుందరావుకి కొత్తకావు. రెండుపూటలా భోజనం వడ్డిస్తూ.. వీధి కుళాయి దగ్గర జరిగిన వీరపోరాటాలు మొదలుకుని ఐక్యరాజ్యసమితి ఆరాటలవరకు ఎకాఎకిన గుక్కతిప్పుకోకుండా రిపోర్టు ఇస్తూంటూంది. అయితేనేం ఆ రోజు జరిగిన కదంబకార్యక్రమం ఏమిటా అని తెలిసికోవాలనిపించింది ముకుందరావుకి.

“ఇంతకీ ఇవాళేం జరిగిందో” అంటూ కొంచెము కుతుహలంగానే అడిగారు.

“అవును మీకు అన్నీ వెటకారంగానే ఉంటాయి. ఇంట్లో పెళ్ళాం ఏం అవస్ధలు పడుతున్నదో, ఎం తిప్పలు తింటున్నాదో అన్న అలోచన ఒక్కసారికూడా రాదుకదా. దానిమాట కాదనకోడదటా, వాళ్ళ వాటవైపు బట్టలారవేయకూడదటా, మనం కరెంటు ఎక్కువగా కాల్చి తినేస్తున్నావంటా, ఒక్కటేమిటీ… నాకు అత్తగారులేని లోటు తీరుస్తూన్నాదిలెండి. చీ. చీ.. ఇంత బతుకు బ్రతికి చివరికి బానిస బ్రతుకైపొయింది జీవితం. అద్దె పూవ్వుల్లో పెట్టి ఇస్తూన్నా సరే ఇంకా సాధింపులు, అక్షింతలునూ. అప్పటికి ఆవిడే ఇంటావిడా అయినట్టు ఓ తెగ ఫీలయిపోతున్నాది. ఇంకా ఒపిక పట్టడం నా వల్లకాదు.” అంటూ గ్లాసుడి మంచినీళ్ళు తాగాడానికి ఆపింది రత్నాలమ్మ. ఆ విషయం గమనించలేదు ముకుందరావు.

“ఇంతకీ ఇప్పుడేం అంటావూ” అంటూ ఓ నవ్వునవ్వేడు. దాంతో రత్నాలమ్మ గారి కోపం ఆకాశానికి అంటుకుంది. ఒక్కసారి గట్టిగా ముక్కుచీదింది. కళ్లు ఎర్రబారి నీళ్ళు రావాటానికి సిద్ద పడిపోయాయి.

“నేనేం అన్నా ఈ కొంపలో ఇప్పటి వరకు చెల్లుబాటు కాలేదుగానీ..ఇహ ఆ పరిస్ధితి లేదు. ఇప్పుడే చేపుతున్నాను. ఆరుమూడైనా, మూడుఆరైనా రేప్పొద్దున్న ఆరుగంటలకల్లా సామాను బండికెక్కవలసిందే. ఇలోగా ఇళ్ళు చూసారా సరేసరి. లేదా అప్పుడే వెతుక్కుందాం. అంతవరకు ఏ చెట్టుకిందో ఉందాం. సీత కూర్చోగాలేనిది.. మనకేం పొతూంది. భయపడ్డానికి ఈ ఊర్లో రావణులు రాక్షసులు ఎవరూ ఉండర్లెండి. అయితేగియితే ఓ రెండు రోజులు ఇబ్బంది పడతాం. అంతేగానీ ఈ ఇంట్లో రేపు ఉదయం అరుదాటిన తర్వతా ఒక్కక్షణం కూడా ఉండనుగాక ఉండను. అఁ.” అంటూ రత్నాలమ్మ గట్టి హెచ్చరిక చేసింది.

ముకుందరావుకి ఈసారి భార్య హెచ్చరికలో కాస్తా నిజం ఉందనిపించింది. కాని ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయ్యడం అంతా అషామాషికాదు.

” చూడు రత్నం. తలవగానే తాతాకి పెళ్ళంటే ఎలా చెప్పు. ఇప్పుడా రాత్రి ఎనిమిదయింది. ఇల్లు వెతకాడానికైనా సమయం, సందర్భం ఉండక్కర్లేదూ. ఓ మంచి ఇళ్ళు చూసి ఖాళి చేసెద్దాంలే.” అంటూ సమాదాన పరచడానికి ప్రయత్నం చేసారు .

“అబ్బే వీల్లేదంటే వీల్లేదు. గాంధీగారు మీలాగే అలోచించిఉంటే దేశానికి ఇంకా స్వాతంత్ర్యం వచ్చీఉండేదికాదు. కొన్ని కొన్ని నిర్ణయాలు వెంటనే తీసుకోవాలిగాని తాత్సారం పనికిరాదు. మీకు చేతకాకపోతే చెప్పండి నేను చేసి చూపెడతాను. అంతేగాని నా నిర్ణయం మార్చుకునే ప్రసక్తిలేదు. ” అంటూ రత్నాలమ్మ మూడో జెండా ఎగెరేసింది.

ముకుందరావుకి తప్పిందికాదు. “అలాగేలే రేప్పోద్దున్న. చూద్దాం లే.” అంటూ మడతమంచం పట్టుకుని వీధిలోకి దారితీసాడు. పడుకున్నాడేగాని నిద్ర రావాటంలేదు. గట్టుమీద ఉన్నవాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. పేరుకి నాలుగు వాటలే గాని అందరు ఒక్కింటిలో ఉన్నవాళ్లలా ఉంటారు. ఇప్పటికి పదేళ్ళు గడిచెయి. ఎప్పుడూ గోడవలు జరగలేదు. అధవా జరిగిన ఆడవాళ్ల వరకే పరిమితమైవిగాని మగాళ్ళవరకు వచ్చిన సందర్భాలు లేవు. ఇల్లు మారిస్తే అద్దె పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, మార్చడానికి ఖర్చు, వీటన్నింటికన్నా మనసులు, మమతలు అక్కడ దొరుకుతాయో లేవో. ఇవాన్ని ఒక్కసారిగా ఎదుర్కోవడం కష్టమే. అలా అలోచనలతో ముకుందరావుకి అర్ధరాత్రి దాటాక నిద్ర పట్టింది.

“వదినగారు” అంటూ పార్వతమ్మ. పిలుపుతో ముకుందరావుకి ఒక్కసారిగా తెలివొచ్చింది. అయినాసరే ఇంకా నిద్ర నటిస్తూ మంచంమీదే అటూఇటూ దొర్లుతున్నారు.

“చూడండొదినగారూ నేను మీకో గిన్నెడు కాఫిపోడుం ఇవ్వాలి. గుర్తూందా. రాత్రి మీ అన్నయ్యా గారు తెచ్చారులెండి. అది ఇద్దామనే వచ్చెను. ఇంకా అన్నయ్యగారు లేవలేదా” అంటూ పార్వతమ్మ మాటలు ప్రారంభించింది.

“ఓ అదా. అయినా ఇంతపోద్దున్నే ఇచ్చెయాలా. అన్నట్టు నిన్న ఆ గెడ్డవీధిలో ఉన్నా మా తోడికోడలు, వాళ్ల ఇంటావిడా మాటమాట అనుకున్నారుట. అది అలా పెరిగి పెద్దదయిపోయి ఇళ్ళు ఖాళి చేసేవరకు వచ్చిసింది. అదేమిటో నలుగురు వింటారనే సిగ్గు లేకుండా దెబ్బలాడెసుకున్నారుట. ఉదయాన్నే మా మరిది ఇళ్ళ వేటలో పడ్డాడు పాపం. ఈ రోజుల్లో ఇల్లు దొరకటం అంత తేలికా. ఏమిటో ఆమాత్రం అభిప్రాయభేదాలు వస్తాయి. సర్దుకుపోవాలేగానీ తాడు తెగేవరకు లాగ్కోడాదు. ” రత్నాలమ్మ మాటలు వినేసరికి ముకుందరావు నిద్ర ఒక్కసారిగా పటాపంచలైపోయింది. మొహం మీద దుప్పటిని తొలగించి హయిగా ఆకాశంలో ఎగురుకుంటూ వేళ్తున్న పక్షులగుంపుని చూస్తూ చెట్టుకింద కాపురనిర్ణయం ఏ మలుపు తిరుగుతూందో అని ఎదురుచూస్తూ ఓ చెవి అటు పారెసి అలా మంచంమీద పడుకున్నాడు.

“అన్నట్టు అసలు విషయం మరిచిపోయాను వదినగారు. మీకు గుర్తుండదుగాని నాకుందిలేండి. మీకో గ్లాసుడు కందిపప్పు బాకీ ఉన్నాను. నిన్ననే అన్నయ్యగారు సామాను తెచ్చెరు. అత్తయ్య గారికి ఇచ్చిరారా అనీ గ్లాసుతో మాపిల్లడికిస్తే వాడు ఆ గ్లాసుని అక్కడే వదిలి ఆడుకోడానికి పారిపోయాడు. వాడిచేత పంపిస్తానులెండి. చెప్పటం మరచిపోయాను. మన ప్రభాత్ టాకిసులో మళ్ళీ పాతాళభైరవి వచ్చిందిటగా. ఇవాళా మాట్నికి వెళ్దాం. రడీగా ఉండండి.” అంటూన్న భార్యమాటలతో ముకుందరావు మంచంమీద నుంచిలేచి పక్కబట్టలు మడత పెట్టసాగాడు. అటు వస్తూనే పార్వతమ్మగారు “ఏవండోయ్ అన్నయ్యగారు ఇప్పుడే లేస్తూన్నారా. మధ్యాహ్నం సినిమాకి వెళ్తున్నాం. మళ్ళీ వదినగారు చెప్పలేదని ఆవిడ్నేం ఆడిపోసుకోకండి” అంటూ పలకరించి తన వాటలోకి వేళ్లిపోయింది.

“స్నేహితుల్ని శత్రువులుగా చేసుకొవటం తేలిక. కాని మరో స్నేహితుడ్ని సంపాదించటం చాలా కష్టం” రాత్రి నిద్ర పట్టక భార్యని తట్టి లేపిఎక్కడో చదివిన మాటల్ని చివరి అస్త్రంగా ప్రస్తావించిన విషయం గుర్తుకొచ్చింది.

‘ఎమైతేనేం పెరటిచెట్టు మందుకు పనికొచ్చిందే’ అని స్వగతంలో అనుకుంటూ మూకుందరావు కాలకృత్యాలు తీర్చుకోడానికి పెరట్లోకి దారితీసాడు.

“ఈ గట్టుమీద ఏ చెట్టు అయినా మందుకు పనికోస్తూందోయ్ బడుద్దాయ్ “అంటూ అయ్యకోనేరు గుబురుగా పెరిగిన మీసాల్లాంటి చెట్లకొమ్మల్ని దువ్వుకుంటూ ముసిముసినవ్వుల్ని చిందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *